
‘దుర్గా’నామాన్ని ఒక మహామంత్రంగా వేదవాఙ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్థశక్తితో పాటు, మహిమాన్వితమైన శబ్దశక్తీ ఉంది. ఆ అర్థాలను సంభావించి, ఈ నామాన్ని ఉచ్చరిస్తే దివ్యఫలితాలను పొందవచ్చని మంత్ర శాస్త్రం స్పష్టం చేస్తోంది. ‘దుర్గా’ నామమే ఒక మహామంత్రం.. దుర్గమమైనది దుర్గ. మనసుకీ, మాటకీ అందని పరతత్త్వమే దుర్గమం (అందరూ తేలిగ్గా ప్రవేశించలేనిది). ఎంతో సాధనతో, యోగంతో పొందవలసిన తత్త్వమది. అందుకే ‘దుర్గ’ అంటే ‘పరతత్త్వం’ (పరబ్రహ్మ) అని ప్రధానార్ధం.
యస్యాః పరతరం నాస్తి
స్చైషా దుర్గా ప్రకీర్తితా
‘దేన్ని మించి మరో తత్త్వం లేదో అదే ‘దుర్గ’, అని వైదిక నిర్వచనం.
2. దుః అనే శబ్దానికి వీలుకానిది. భరించలేనిది అని అర్ధం. దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుఃస్థితి… ఇవన్నీ ‘దుః’ శబ్దంతో కుడిన పదాలు. వీటన్నింటిని సమూలంగా తొలగించే ఆనంద శక్తి దుర్గ. “రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవి” – అని శాస్త్రం వివరించింది.
3. వేద ధర్మానికి విఘాతం కలిగించి, దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం చేత ‘దుర్గా’ నామం వచ్చినట్లు దేవీ భాగవతం చెబుతోంది.
దుర్గమాసురహంత్రీ త్వాత్
దుగ్గేరి మమ నామయః ౹౹
4. దుర్గము అంటే ‘కోట’ అని కూడా అర్ధం. పరుల బాధలేకుండా, మనలను రక్షించే ఆశ్రయం దుర్గం. అదేవిధంగా ఆశ్రయించిన భక్తులను అన్నివిధాల ఆదుకునే తల్లి దుర్గ.
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి ||
“నిన్ను ఆశ్రయించిన నరులకు విపత్తులుండవు. నిన్ను ఆశ్రయించినవాడే, సరియైన దాన్ని ఆశ్రయించినవాడు” (దేవీ మాహాత్మ్యం – మార్కండేయపురాణం).
ఈ భావనలో ‘దుర్గా’ అంటే ‘ఆశ్రయశక్తి’ అని అర్ధం.
5. వేదం దుర్గను ‘తారిణీ శక్తి’గా పేర్కొంది. దాటించే శక్తి – దుర్గ. కష్టాల కడలినుండి తన భక్తులను దాటించి, ఒడ్డున చేర్చే నావగా వేదం దేవీని వర్ణించింది.
“నావేవ సింధుం దురితాత్యగ్నిః”
“దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే
సుతరసి తరసే నమః” – వంటి వేదమంత్రాలు ఈ భావనను చెబుతున్నాయి.
తాం దుర్గాం దుర్గమాం దేవీం
దురాచార విఘాతినీం |
నమామి భవభీతోహం
సంసారార్ణవతారిణీమ్ ౹౹
“అంతుపట్టని తత్త్వంగల దుర్గాదేవి, దురాచారాలను నశింపజేసే తల్లి.
సంసార సముద్రాన్ని దాటించే ఆ దేవిని భవభీతుడనైన (సంసారం వల్ల భయపడే) నేను నమస్కరిస్తున్నాను” అని దేవ్యథర్వశీర్షం ‘దుర్గ’ నామానికి నిర్వచనాలిచ్చింది.
