మరణానంతరం అసలు ఏం జరుగుతుంది? ఎవరికీ తెలియని మిస్టరీ అది. నిత్యం ఈ భూమ్మీద మనమేదో శాశ్వతమన్నట్టుగా ఎన్నో పనులు చేస్తుంటాం. ఎన్నో బంధాలను ముడివేసుకుంటాం. అన్నీ వదిలేసి ఒక్క క్షణం ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఆ తరువాత ఏం జరుగుతుంది? హిందూ సంప్రదాయంలో అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ భగవంతుని కథలు, భాగవతుల చరిత్రలు, పురాణం గాధలు, ఇతిహాసాలలో నిండి ఉంటే గరుడ పురాణం మాత్రం మనిషి మరణానంతరం ఏమి జరుగుతుందో తెలియజేస్తుంది.
గరుడ పురాణం గురించి చాలా సందర్భాల్లో వింటుంటాం. అసలందులో ఏముందో తెలుసుకుందాం. గరుడపురాణం వైష్ణవ సంప్రదాయానికి చెందినది. దీనిని వ్యాస మహర్షి రచించాడు. శ్రీ మహావిష్ణువు తనకు అత్యంత ఇష్టుడైన గరుత్మంతునికి ఈ పురాణాన్ని ఉపదేశించాడట. కాబట్టి దీనికి పురాణం అని పేరు వచ్చింది. గరుడ పురాణంలో మొత్తం 18 వేల శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల్లో మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చేసిన పాప ఫలితాల శిక్షలను వివరించారు. మరణానంతరం ఏమి జరుగుతుందనేది ప్రతి ఒక్కరికీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఈ గరుడ పురాణంలో విష్ణుమూర్తి మరణానంతరం ఏం జరుగుతుందనేది గరుత్మంతుడికి ఇచ్చిన వివరణ ఉంటుంది.