శ్రీవారి దర్శన టికెట్లు కావాలా? అయితే ఇది సేవ్ చేసుకోండి.. ఫుల్ ఇన్ఫో మీకోసం..

తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనానికి వెళ్లేవారికి ఏ ఏ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి శ్రీవారి అన్ని దర్శనాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫో మీకోసం.. ఇంకెందుకు ఆలస్యం.. చూసేసి సేవ్ చేసుకోండి. టైంకి ఆన్‌లైన్‌లో టికెట్లు పొందండి. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మే 21న వర్చువల్ సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మే 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు… ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మే 27న శ్రీవారి సేవ కోటా విడుదల

మే 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Share this post with your friends