దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి అరుణాచలం లేదా అన్నామలై. పంచభూత లింగ క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా అరుణాచలేశ్వరుడిని పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం.ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలు.. మన సకల పాపాలన్నీ పోతాయట. అందుకే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. తమిళంలో దీనిని ‘తిరువన్నామలై’ అంటారు. ఇక్కడ మరింత ప్రత్యేకం ఏంటంటే.. గిరి ప్రదక్షిణ. అరుణాచలం క్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎవరో ఒకరు తప్పక గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు.
ఇక ఇప్పుడు ఒకవైపు భారీ వర్షం.. విపరీతమైన చలి ఉంటోంది. అయినా సరే గిరి ప్రదక్షిణ మాత్రం భక్తులు మానడం లేదు. తాజాగా ఓ భక్తుడు చేసిన గిరి ప్రదక్షిణ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఆ భక్తుడు యువకుడు కాదు.. 85 ఏళ్ల పండు వృద్ధుడు.. చలికి వణుకుతూ.. కనీసం చకచకా నడిచే పరిస్థితి కూడా లేదు. అడుగులో అడుగు వేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. అతను చేస్తున్న గిరి ప్రదక్షిణ చాగంటి కోటేశ్వరరావుని కూడా ఆకర్షించింది. ఆయన నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. ‘85 సంవత్సరాల వయస్సులో ఆయన అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మరి మీరు ఎప్పుడు చేస్తారు?’ అంటూ చాగంటి వారు ప్రశ్నించారు.