శ్రావణమాసంలో కావడి ఉత్సవం జరుగుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుంచి కావడిలో కాలినడకన తమ గ్రామానికి తీసుకొస్తారు. గ్రామంలోని శివాలయంలో శివుడిని ఆ నీటితో అభిషేకిస్తూ ఉంటారు. ఇందుకోసం భక్తులు ఢిల్లీ హరిద్వార్ జాతీయ రాహదారిపై లక్షల సంఖ్యలో కాలి నడకన ప్రయాణిస్తారు. శతాబ్దాలుగా ఈ కావడి (కావడ్) యాత్ర జరుగుతోంది.
విశాఖలోని మార్వాడిల ఆధ్వర్యంలో నేడు కావిడి యాత్ర జరుగుతోంది. శివ నామ స్మరణతో విశాఖ మారుమోగుతోంది. మాధవధార నుంచి ఆర్కే బీచ్ వరకూ ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. భక్తులంతా కాషాయ వస్త్రాలు ధరించి.. హర హర శంభో శంకర అంటూ యాత్రలో భక్తులు పాల్గొన్నారు. చిన్నచిన్న కుండల్లో నీటిని పట్టి వాటిని కావడి కట్టి.. మోస్తూ భక్తులు ఆర్కే బీచ్‌కు చేరుకుంటున్నారు. యాత్ర అనంతరం పరమ శివుడికి గంగాజలంతో అభిషేకం చేయనున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నాడు యాత్రను నిర్వహించడం ఆచారంగా వస్తోంది.