తిరుమల తిరుమతి దేవస్థానానికి మరో కీలక అధికారి నియామకం జరిగింది. టీటీడీ అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించేందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వెంకయ్య చౌదరి వరహాస్వామిని దర్శించుకున్నారు. ఇవాల ఉదయం10.30 గంటలకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. స్వామివారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వెంకయ్య చౌదరిని ఆశీర్వదించారు. ఆయనను శ్రీవారి వస్త్రంతో ఆలయ అధికారులు సత్కరించారు.
టీటీడీ అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకయ్య చౌదరి 2005వ బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి. ఆయనను సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి పిలిపించారు. ఈ మేరకు కేంద్రానికి చౌదరిని డిప్యుటేషన్‌పై పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి కేంద్రం ఈ నెల 16న ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తిరుమల జేఈవోగానూ విధులను అప్పగిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే వెంకయ్య చౌదరి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.