స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి అయిన కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో ఆకర్షణీయంగా సిద్ధమైంది. ఈ ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. రేపు వినాయక చవితి కాగా.. 8న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణం జరుగనుంది. 8 నుంచి 16 వరకూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. 17 నుంచి 27 వరకూ పలు వాహన సేవలు జరుగనున్నాయి. 27వ తేదీన తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
దేశంలో ఎక్కడా కూడా ఇలా 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగవు. కేవలం కాణిపాకం ఆలయంలోనే ఇలా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏర్పాటు చేసింది. ఇక వినాయక చవితి రోజు అర్ధరాత్రి 2 గంటలకు ఉభయదారులు స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం 3 గంటల నుంచి భక్తులకు స్వామి వారి సర్వదర్శనం కల్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.