శ్రావణ మాసంలో మహిళలంతా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఈ వ్రతాన్ని ఆగస్ట్ 16, 2024 శుక్రవారం రోజున జరుపుకుంటాము.
వరలక్ష్మీ వ్రత పూజా విధానం ఏంటంటే..
వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు బ్రహ్మముహూర్తాన లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అనంతరం శుచిగా స్నానమాచరించి పూజా గదిని.. వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలాన్ని ముందుగా గంగా జలంతో శుద్ధి చేసి ఒక చెక్క పీటను తీసుకుని దానిపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి లక్ష్మీదేవి, గణపతిల విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించాలి. లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్టించండి.
ఇక ఆ తరువాత లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడి విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చేసి అగరబత్తీలను సైతం వెలిగించాలి. ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. విఘ్నేశ్వరుడికి పూల మాల వేసి.. పువ్వులు, పసుపు – కుంకుమలతో పాటు దర్బ, కొబ్బరికాయ, చందనం, అక్షితలు సమర్పిస్తూ పూజా చేయాలి. ఆ తరువాత వరలక్ష్మీదేవి పూజను ఆరంభించాలి. అమ్మవారికి పదహారు అలంకారాలతో పాటు పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాల సమర్పించాలి. ఆ తరువాత అమ్మవారికి నైవేద్యంగా పులిహోరం, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు వంటి తొమ్మిది లేదంటే ఐదు రకాల ఆహారపదార్ధాలను సమర్పించాలి. తరువాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజ చేయాలి. పూజ సమయంలో వరలక్ష్మీ వ్రత కథను పఠించి ఇక చివరిగా అమ్మవారికి హారతి ఇవ్వాలి. దీంతో పూజ ముగుస్తుంది. ఆ తరువాత అందరికీ ప్రసాదం అందించి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి.