కన్నుల పండువగా వళ్లీ దేవసేన సమేత కళ్యాణ సుబ్రమణ్యస్వామి కల్యాణోత్సవం

ఆడికృత్తిక మహోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లోనూ అంగరంగ వైభవంగా జరిగాయి. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లె సమీపంలోని ఆనందగిరి (పాళ్యంకొండ)పై ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వళ్లీ దేవసేన సమేత కళ్యాణ సుబ్రమణ్యస్వామికి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని కల్యాణోత్సవానికి పూజ సామగ్రి, పూలమాలలను సమర్పించారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆడికృత్తికను పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు బారులు తీరడం విశేషం. అలాగే స్వామివారికి పుష్పకావిళ్లు, తలనీలాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించిన పల్లకిలో వళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి పురవీధుల్లో విహరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ ఊరేగింపు ఉత్సవంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృత్తిక మహోత్సవం జరిగింది. ఇక శ్రీకాళహస్తిలోనూ శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.

Share this post with your friends