వచ్చే ఏడాది జనవరిలో మహా కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 2025 జనవరి 13 నుంచి జరగబోయే మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రయాగ్ రాజ్‌ను అందంగా ముస్తాబు చేస్తున్నారు. స్నానం చేయడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున రైళ్లను అన్ని ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసింది. అలాగే బస్సులను సైతం ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో ఏకంగా 350 షటిల్ బస్సుల సేవలను రవాణా సంస్థ ప్రారంభించనుంది. జాతరలో మొదటి దశలో 2000 బస్సులు, రెండో దశలో 6800 ఆర్డినరీ, 200 ఏసీ బస్సులు కలిపి 7000 బస్సులతో పాటు 200 సిటీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా షటిల్ సర్వీసులో ఉంటాయి. వారణాసి రోడ్‌వేస్ సైతం 50 ప్రత్యేక కుంభ్ షటిల్ బస్సులను కూడా సిద్ధం చేసింది. ఇక రవాణా సదుపాయం అందరికీ అందేలా చూడాలని 22 మంది అధికారులతో కూడిన బృందాన్ని అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొరాదాబాద్‌కు చెందిన అనురాగ్ యాదవ్‌ను సర్వీస్ మేనేజర్‌గా ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అలాగే ఎక్కడికక్కడ క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించనుంది. ఈ బృందాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు రవాణా సంస్థ సాంకేతిక సిబ్బంది బస్సులలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటారు.