జలపాత హోరుతో మరింత రమణీయంగా ఉమామహేశ్వర క్షేత్రం

ఉమామహేశ్వర క్షేత్రం గురించి తెలుసా? నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం నల్లమల ప్రాంతమైన రంగాపూర్ గ్రామపంచాయతీలో ఉందీ పుణ్య క్షేత్రం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే.. కొండలో మిళితమై ఉంటుంది. ఇక ఇక్కడ సంవత్సరంమంతా కూడా నీరు కొండలో నుంచి ఎప్పటికి సజీవజలంలా జాలువారుతూనే ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రక్కృతి ఒడిలో నుంచి వచ్చిన స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రాలలో ఇది ఒకటి కావడం విశేషం. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం. ఇప్పుడు మరింత రమణీయంగా మారింది.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ తరుణంలో రంగాపురంలోని శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో జలపాతం అందాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. దేవస్థానం పాపనాశనం వద్ద జలపాతం అక్కడకు వెళ్లిన వారిని మంత్ర ముగ్దులను చేస్తోంది. చుట్టూ పచ్చని వాతావరణం నడుమ పర్వతంపై నుంచి కిందికి దూకుతున్న జలపాతం.. అద్భుతంగా అనిపిస్తోంది. దీంతో ఈ అందాలను చూసేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు సైతం క్యూ కడుతున్నారు. అయితే అధికారులు మాత్రం జలపాతం ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచిస్తున్నారు. పర్వతంపై నుంచి రాళ్లు జారి పడే ప్రమాదం ఉండటంతో దూరం నుంచే జలపాతాన్ని చూడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి జలపాత హోరుతో ఉమామహేశ్వర క్షేత్రం మరింత రమణీయంగా మారింది.

Share this post with your friends