తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో భక్తులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. ఈ ఆలయంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతి నెలా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ నెలలోనూ పలు ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఆగస్టు 16వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.