ఆ భస్మం నుంచి తులసి పుట్టిందట..

తులసిని ప్రతి ఇంటి ముందు నాటి ప్రతిరోజూ పూజలు చేసుకుంటూ ఉంటాం. తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటాం. మరి తులసి ఎలా పుట్టిందో తెలుసా? దానికి ఓ కథ ఉంది. వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతంలోని తులసీ మాత కథను చదివితే పాతివ్రత్యాన్ని అంతటి గొప్ప మహిమ ఉందా? అనిపిస్తుంది. జలంధరుడు అనే రాక్షసుడి గురించి చెప్పుకున్నాం కదా.. ఆయన సతీమణి బృంద మహా గొప్ప పతివత్ర. ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగే తప్ప జలంధరుడికి మరణం రాదు. దీంతో దేవలందరినీ రక్షించేందుకు విష్ణుమూర్తి స్వయంగా జలంధరుడి రూపంలో వెళ్లి బృంద పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు.

ఇటు బృంద పాతివ్రత్యానికి భంగం కలగగానే అటు జలంధరుడు శివుడి చేతిలో మరణిస్తాడు. విషయం తెలుసుకున్న బృంద రాయిలా మారాలంటూ విష్ణుమూర్తిని శపించగా.. లక్ష్మీదేవి వచ్చి ఆమెను వేడుకని తన భర్తకు శాపవిమోచనం కావిస్తుంది. ఆ తరువాత బృంద తన భర్త చితిలో దూకేస్తుంది. దీంతో ఆమె శరీరం పంచభూతాల్లో కలిసి భస్మం ఏర్పడుతుంది. ఈ భస్మం నుంచి పుట్టినదే తులసి మొక్క. ఈ మొక్కకు సాక్షాత్తు విష్ణుమూర్తే తులసి అని నామకరణం చేసి తనతో పాటు వైకుంఠానికి తీసుకెళతాడు. అదీ తులసి కథ. ఇక విష్ణుమూర్తి శాపవిమోచనం పొందిన ప్రదేశమే నేపాల్‌లోని ముక్తిథామ్.

Share this post with your friends