తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచనలు చేశారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని వెల్లడించారు. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేయడమైనది.
భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని వెల్లడించారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. అనంతరం జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.