ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ, నిఘా మరియు భద్రత, శ్రీవారి సేవకులు, పుష్పాలంకరణ , విద్యుత్ అలంకరణలు, ఇంజనీరింగ్ పనులు తదితర అంశాలపై శాఖలవారీగా ఈవో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సాల్, టిటిడి సిఈ శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.