తిరుమ‌ల‌లో జూన్‌ 1 నుండి 5వ తేదీ వరకు హనుమత్‌ జయంతి ఉత్సవాలు

తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్‌ 1 నుండి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా జూన్‌ 1న శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి విశేషంగా తిరుమంజనం, 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. హనుమత్‌ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారికి విశేష అభిషేక, పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్‌ 2న ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుంది. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు.

Share this post with your friends