శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు

శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టం అని టీటీడీ కొత్త అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణ దారులు వేదశీర్వచనం చేశారు.తరువాత అదనపు ఈవోకు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకితభావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు.

Share this post with your friends