టీటీడీ ‘తిరుమల విజన్ – 2047’ కోసం ప్రతిపాదనలకు ఆహ్వానం

“స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047″కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌తో “తిరుమల విజన్ – 2047” ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల‌ కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసింది.

టీటీడీ బోర్డు నిర్ణయం

ఇటీవ‌ల తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ సమావేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాల‌ని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.

ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌

తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికత‌తో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సీఎం శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు తెలియ‌జేశారు. తిరుమల ఆధ్యాత్మికం, పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భ‌క్తుల‌కు సౌకర్యాలు, వసతిని మెరుగుప‌ర్చాల‌ని ఆయన పిలుపునిచ్చారు.

విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలు

ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ తిరుమల‌ పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వ‌త‌మైన వ్యూహాలను అమ‌లు చేయ‌డం. ఉత్త‌మ‌మైన ప్ర‌ణాళిక‌లు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం. ప్ర‌పంచవ్యాప్తంగా తిరుమ‌ల‌ను రోల్ మోడ‌ల్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రయత్నిస్తుంది.

క‌న్స‌ల్టెంట్ల నుంచి ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆహ్వానం

తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చ‌ర్‌, ఇంజినీరింగ్‌, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్ర‌త్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానిస్తోంది. ఇప్ప‌టికే తిరుమ‌ల‌ ప‌ట్ట‌ణ ప్ర‌ణాళికపై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం జ‌రిగింది.

Share this post with your friends