అన్నమయ్య సంకీర్తనలను జనాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన టీటీడీ

పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించిన 32 వేల సంకీర్తనలలో, కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని, ఇంకను అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యం లోనికి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఆల్ ప్రాజెక్టుల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అన్నమాచార్య సంకీర్తనలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నారు.

ఇప్పటివరకు అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనలలో ఎన్ని సంకీర్తనలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని సంకీర్తనలు పరిష్కరించాలి, పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్టు, శ్రీనివాస కళ్యాణం, వైభోత్సవాల ప్రాజెక్ట్, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు, శ్రీ సారంగపాణి ప్రాజెక్టు, టీటీడీ ప్రచురణ విభాగంపై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.

Share this post with your friends