టీటీడీ అదనపు ఈవోగా శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టాక పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలలోని క్యూలైన్స్ అన్నింటినీ పరిశీలించారు. మళ్లీ ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద వున్న ఏస్ఎస్‌డీ క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మరియు 2లోని కంపార్ట్‌మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.
అనంతరం ఎస్ఈడి క్యూ లైన్లను, ఫోటో క్యాప్చర్ తదితరాంశాలను పరిశీలించారు. అంతకు ముందు క్యూలైన్లను పరిశీలించిన వెంకయ్య చౌదరి భక్తులతో మాట్లాడారు. అన్నప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు కూడా టీటీడీ అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు, పెద్ద స్క్రీన్ లలో ప్రసారం అవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషలలో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.