టీటీడీకి రికార్డ్ స్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు

కలియుగ దైవం వేంకన్న స్వామి వారికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలను బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో సమర్పిస్తున్నారు. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వచ్చాయి. టీటీడీ ఈ ఏడాదికి గానూ రూ.1161 కోట్లను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. దీంతో టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.18 వేల కోట్లను దాటాయి. ఇక బంగారం సైతం పెద్ద ఎత్తున విరాళంగా వచ్చింది. దీంతో ఈ వార్షిక సంవత్సరంలోనే అత్యధిక బంగారాన్ని టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేసింది. 2023లో 773 కోట్ల రూపాయల విలువైన 1,031 కిలోల బంగారం డిపాజిట్ అయినట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

తిరుపతి ట్రస్టుకు బంగారం మానిటైజేషన్ పథకం కింద వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.8,496 కోట్ల విలువైన 11,329 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున స్వామివారికి బంగారం విరాళంగా రావడం విశేషం. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారికి ప్రతి ఏటా సగటున రూ.1600 కోట్ల హుండీ ఆదాయం వస్తుంది. ఇక వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే విరాళాల్లో బంగారం రెండో స్థానంలో ఉంటుంది. ఆలయానికి ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లు పైగా వస్తుండగా.. బంగారం వచ్చేసి ప్రతి నెలా 90 నుంచి 100 కిలోలను భక్తులు సమర్పిస్తుంటారు.

Share this post with your friends