ఈ గణేశుడికి తొండమే చాలా స్పెషల్..

సిద్ధి వినాయకుడి ప్రతి ఒక్క క్షేత్రానికి ఓ ప్రత్యేకత తప్పక ఉంటుంది. మహారాష్ట్ర అహ్మద్​నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద కొలువైన సిద్ధి వినాయకుడికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లోనూ బొజ్జ గణపయ్య తొండం కుడి వైపునకు తిరిగి ఉంటుంది. ఈ క్షేత్ర ప్రత్యేకతేంటంటే గణపతి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. ఇక్కడ వినాయకుడు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుదీరి ఉంటాడు. ఇక ఈ వినాయకుడిని దర్శించుకుంటే చాలు.. మనం తలపెట్టిన పనులన్నీ తప్పక పూర్తవుతాయట. సద్భుద్దిని సైతం ఈ గణపయ్య ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.

స్థల పురాణం ప్రకారం.. ఎంతో మంది రాక్షసులను సంహరించిన శ్రీమహావిష్ణువు మధు, కైటభులనే రాక్షసులను సంహరించే క్రమంలో ఇబ్బంది ఎదురైందట. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వినాయకుని సహాయం తీసుకుని వారిద్దరినీ హతమార్చాడట. ఆ తర్వాత శ్రీమహావిష్ణువే స్వయంగా గణనాథుని పట్ల కృతజ్ఞతతో తానే స్వయంగా గణనాథుని ప్రతిష్ఠించి వినాయకునికి ఇక్కడ ఆలయం నిర్మించాడట. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయట. ఏ పని చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్మకం. కాబట్టి గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పక గిరి ప్రదక్షిణ చేస్తారు.

Share this post with your friends