లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 10వ తేదీ అయోధ్యకాండ 12వ విడత అఖండ పారాయణం జరిగింది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయోధ్య కాండ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించి ఆనందపరవశులయ్యారు. ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం, టీటీడీ వేదపండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయోధ్యకాండలోని 45 నుండి 49 సర్గలలోని 141 శ్లోకాలు, పారాయణం చేస్తారు. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం పండితులు శ్రీ రామానుజా చార్యులు, శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేశారు. రామాయణంలోని విభాగాలను ‘’కాండములు’’ అంటారు. ఒక్కో కాండము తిరిగి కొన్ని సర్గలుగా విభజింపబడింది. అయోధ్యకాండ రెండవది. ఇందులో మొత్తంగా 119 సర్గలు ఉండగా నేడు 45 నుంచి 49 సర్గలలోని శ్లోకాలను పారాయణం చేయడం జరిగింది.ఈ కాండములోని ప్రధాన కథాంశాలేంటంటే.. శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము వంటివి ఉన్నాయి.