ఇవాళ కామిక ఏకాదశి. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున అంతా విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. ఇవాళ శ్రీ మహా విష్ణువును పూజిస్తే భక్తులకు ఎన్నో రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుందట. అయితే ఇవాళ కొన్ని పరిహారాలు చేసినా కూడా చాలా మంచిదట. తద్వారా విష్ణు మూర్తి అనుగ్రహం పొంది సమస్యల నుంచి బయటపడతామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇవాళ విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. అలా చేస్తే వారిద్దరి ఆశీర్వాదం మనకు లభించడంతో పాటు మన ఇంట ఆనందం, శాంతి, శ్రేయస్సు, శోభ నెలకొంటాయట. ఇలా చేయడం వలన మన జాతకంలోనూ బృహస్పతి స్థానం మెరుగుపడి అన్ని విధాలుగా బాగుంటుందట.
కామిక ఏకాదశి రోజున తులసిని పూజించి నెయ్యి దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలుగుతాయట. ఇవాళ తులశమ్మకు పసుపు, కుంకుమలను సమర్పించి నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే.. పసుపు గుడ్డను తీసుకొని అందులో 2 స్పూన్ల పసుపు, ఒక రూపాయి నాణెం, 5 పసుపు కౌరీలను ఉంచి ముడుపు కట్టాలి. ఈ ముడుపుని విష్ణు మూర్తి దగ్గర ఉంచి నియమ నిబంధనల ప్రకారం పూజిస్తే ఆర్థిక కష్టాలు పోతాయట. జీవితంలో జరుగుతున్న కష్టాలు, బాధలు తొలగిపోవాలంటే ఇవాళ విష్ణు చాలీసా పారాయణం చేయాలి.