ఆషాఢమాసం అమ్మవారి ఆరాధనకు అత్యంత విశిష్టమైన మాసం. ఈ నెలలో బోనాల పేరిట గ్రామ దేవతల ఆలయాల్లో జాతర, శాకంబరీ ఉత్సవాలు, అమ్మవారికి సారె సమర్పణ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిన్నటి నుంచే ఆషాఢ మాసం ఆరంభమైంది. ఈ సందర్భంగా బోనాల జాతర కూడా ప్రారంభమైంది. ఈ ఆషాఢ మాసంలోనే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం నాడు అమ్మవారి కల్యాణం జరుగుతుంది. ఈ లెక్కన రేపే అమ్మవారి కల్యాణం.
బల్కంపేట అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఇవాళ ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇక ఎల్లమ్మ వివాహాన్ని మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ నెల 9న అంటే రేపు ఈ కల్యాణం వైభవంగా జరగనుంది. ఈ కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. ఈ కల్యాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. అయితే ఈ కల్యాణాన్ని తిలకించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కల్యాణాన్ని తిలకించేందుకు వస్తారు.