మహిషాసురుడిని వధించేందుకు త్రిమూర్తులే స్త్రీ రూపంగా..

దైత్య వంశానికి మహిషాసురుడు ఓ ఆశాదీపంలా జన్మించాడు. ఆయన తనకు మరణం రాకూడదని బ్రహ్మ దేవుడి గురించి ఘోర తపస్సు చేశాడు. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై.. మహిషాసురుడిని ఇకపై తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. తనకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని మహిషాసురుడు కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దానికి అంగీకరించలేదు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని.. కాబట్టి ప్రకృతి విరుద్ధమైన మహిషాసురుడి కోరికను తీర్చడం అసాధ్యమని తెలిపాడు. దీనికి మహిషాసురుడు.. మహిళలు అల్పురని.. వారు తనను సంహరించలేరు కాబట్టి పురుషుడి చేతిలో తన మరణం సంభవించకుండా వరం కోరాడు.దీంతో బ్రహ్మ వరం అనుగ్రహించాడు.

వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో సైతం యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దీంతో దేవేంద్రుడు త్రిమూర్తులకు మొర పెట్టుకున్నారు. మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారి.. అది కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేసింది. ఎట్టకేలకు మహిషాసురుడిని సంహరించింది.అప్పటి నుంచి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు జరుపుకుంటున్నారు.

Share this post with your friends