తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం విజిలెన్స్ అధికారులు సోదాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు టీటీడీలో పలు విభాగాల్లో పని చేస్తున్న 58 మందికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనుల విషయంలో భారీగా అవినీతి జరిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ముడిసరుకుల కొనుగోలు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ ప్రభుత్వానికి, సీఐడీకి ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే పలువురు అధికారులు, ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీరంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా.. అవసరానికి మించి ఇంజినీరింగ్ పనులకు నిధులు కేటాయించారట. కమీషన్లకు కక్కుర్తిపడి శ్రీవారికి చెందిన కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశారంటూ వార్తలొచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్ బృందాలను రంగంలోకి దింపింది. కీలక విభాగాల్లో సోదాలతో పాటు పలువురు టీటీడీ అధికారులను విచారించిన మీదట టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో పని చేసిన 58 మందికి విజిలెన్స్ నోటీసులు జారీ చేసింది.