సరికొత్త అందాలకు నెలవుగా తిరుమల ప్రాంతం

అద్భుత దృశ్యానికి తిరుమల వేదికగా మారింది. తాజాగా తిరుమలలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా పొంగి పొర్లుతోంది. దీంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతాన్ని తిలకించేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలడం లేదు. కపిలతీర్థం ఎత్తైన జలపాతం నుంచి కుండపోతగా వర్షం నీరు పడుతుంటంతో ఆ ప్రాంతం వద్దకు భక్తులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెళ్లనివ్వకుండా చర్యలు చేపట్టారు. కపిలతీర్థం జలపాతం వర్షాల కారణంగా మునుపెన్నడూ లేని అందాలను సంతరించుకుంది.

ఏడుకొండల్లో వర్షాల కారణంగా పచ్చదనం పరుచుకుంది. ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాలతో సరికొత్త అందాలకు తిరుమల ప్రాంతం నెలవుగా మారింది. అయితే కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. తిరుమలలోని జలాశయాలన్ని భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్నాయి. గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండాయి. అదే విధంగా వర్షం కారణంగా తిరుగిరుల్లో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

Share this post with your friends