శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ.. రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ పెద్ద పీఠ వేస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. నారాయణగిరి షెడ్ల వద్ద ఇటీవలే ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ తో భక్తులు క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గింది.

డిప్యూటీ ఈవో లు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షిస్తూ టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగు నీటిని 24 గంటలు పంపిణీ చేశారు. భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this post with your friends