వారణాసికి వెళ్లేవారు ఈ ఆలయం గురించి కూడా తప్పక తెలుసుకోండి..

వారణాసి ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతోంది. ఇక్కడ ఎటు చూసినా మనకు ఓ దేవాలయం కనిపిస్తుంది. అయితే ఇక్కడి దేవాలయాలన్నింటిలోకి ఓ దేవాలయం చాలా ప్రత్యేకం. ఈ ఆలయానికి కుల, మతాలతో సంబంధం లేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా సరే.. ఆ మాటకొస్తే భారతీయులు ఎవరైనా ఆనందంగా వెళతారు. ఇక్కడ ఉండే దేవత ఎవరంటారా? తెలుసుకుందాం. ఈ ఆలయంలో భరత మాత కొలువై ఉంటుంది. పాలరాతితో చెక్కిన అఖండ భారత దేశ పటం మనకు కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదేమో.

మన దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ ఆలయాన్ని నిర్మించారు. పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు శివ ప్రసాద్ గుప్తా, ప్రధాన వాస్తుశిల్పి దుర్గా ప్రసాద్ ఖత్రి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠం క్యాంపస్‌లో ఇది ఉంటుంది. దీనిని 1936 అక్టోబరు 25న స్వయంగా మహాత్మాగాంధీ ప్రారంభించారు. భారత్, పాక్ విడిపోక ముందు భారత దేశ పాలరాతి పటం ఉంటుంది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అప్పటి ప్రజలు పడిన కష్టాలను ఈ ఆలయం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో 30 మంది కూలీలు, 25 మంది తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. కాశీకి వెళ్లిన వారంతా తప్పక ఈ ఆలయానికి కూడా వెళుతుంటారు.

Share this post with your friends