
అరుణాచలానికి కొత్తగా వెళ్లేవారు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసే వారు ఏం చేయాలనేది ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని.. మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది.
దాదాపుగా కూర్చోకుండా నిలబడి గానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకోండి. కూర్చోవడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపున స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు. లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కచ్చితంగా దర్శనం చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది ‘ఆ మండపంపైకి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు.
