తమిళనాడులోని ధరాసురంలో ఉన్న ఐరావతేశ్వర ఆలయం గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం 1160 లలో నిర్మితమైందని తెలుస్తోంది. చోళ, పాండ్య, నాయక వంశాలు ఏలాయి కాబట్టి వారి శాసనాలన్నీ ఇక్కడ సజీవంగా ఉన్నాయి. వివిధ రాజుల పాలనా కాలన్ని.. రాజ్యంలో ఉన్న పరిస్థితులను ఇవి వివరిస్తున్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో సైతం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయంలో ఒకసారి యముడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నాడట.
యముడు ఇక్కడి కోనేటిలో మునగగానే ఆయనకు శాపాల నుంచి విమోచనం కలిగిందట. అప్పటి నుంచి ఈ కోనేటిని యమతీర్థంగా పిలుస్తారు. స్వచ్ఛమైన కావేరీ జలానిండి ఉండే ఈ కోనేటి వెడల్పు 200 అడుగులకు పైనే ఉంటుంది. నాటి శిల్ప కళా నైపుణ్యానికి ఈ ఆలయం తార్కాణం. అణువణులోనూ సృజనాత్మకత ఉట్టి పడుతుంది. ఎందరో దేవతా శిల్పాలు, భరత నాట్య భంగిమలు, పౌరాణిక గాథలకు సంబంధించిన శిల్పాలతో ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే.. వినాయకుడి ఉపాలయానికి చేరుకునేందుకు ఉన్న మెట్లను తాకితే మనకు సప్త స్వరాలు వినిపిస్తాయి.