ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్యప్రదేశం తమిళనాడులోని కాంచీపురం. ఇక్కడ వెయ్యికి పైగా ఆలయాలున్నాయి. ముఖ్యంగా మనం కొన్ని ఆలయాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడి విశేషాలు అలాంటివి. అలాంటి చెప్పుకోదగిన ఆలయాల్లో అత్తివరదరాజ స్వామి ఆలయం ఒకటి. తమిళుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అత్తివరదరాజ స్వామి కొలవబడుతున్నాడు. 108 దివ్యతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? అంటారా? ఇక్కడ 40 ఏళ్లకు ఓసారి ఓ విశేషం జరుగుతుంది. దాని కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. అసలా విశేషం ఏంటి? తిరిగి ఎప్పుడు జరుగుతుంది?
పురాణ కాలంలో బ్రహ్మదేవుడు ఓ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించాడట. ఆ తరువాతి కాలంలో భారత్‌పై తురుష్కులు పెద్ద ఎత్తున దండయాత్రలు చేసేవారు. ఈ క్రమంలోనే కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చేసి పెద్ద ఎత్తున సంపదను దోచేశారు. ఆ సమయంలో తురుష్కుల దండయాత్ర నుంచి స్వామివారికి ఎలాంటి హాని కలగకుండా విగ్రహాన్ని ఓ వెండి పెట్టెలో పెట్టి కోనేటి అడుగున దాచేశారట. ఆ తరువాత గర్భాలయంలో వేరొక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ భద్రపరిచిన స్వామివారిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి ఆలయంలోని వసంత మండపంలో ఉంచి 48 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అలా 2019 జులై 1 వ తేదీ నుంచి ఆగస్ట్17 వ తేదీ వరకు స్వామివారు దర్శనమిచ్చారు. తిరిగి 2059లో దర్శనమిస్తారన్నమాట.