మనదేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వాటిలో కొన్ని వేల ఏళ్ల నాటికి చెందినవి. ఈ ఆలయాల నిర్మాణమే అత్యద్భుతం. పైగా మిస్టరీకి కేరాఫ్ అడ్రస్. ఆలయాల నిర్మాణంతో పాటు గర్భగుడిలో స్వామివారిని ప్రతిష్టించిన తీరు వరకూ ఏమాత్రం సైన్స్‌కు అంతుబట్టని మిస్టరీ. అలాంటి మిస్టీరియస్ ఆలయాల్లో ఒకటి కేరళలోని పుత్తూరు గ్రామంలో ఉంది. ఇది ఈనాటి ఆలయం కాదు. మూడు వేల ఏళ్ల నాటిది. ఈ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని నీర్ పుత్తూరు మహాదేవ్ ఆలయంగా పిలుస్తారు. దీనిలోని రహస్యాలను నేటికీ సైంటిస్టులు సైతం ఛేదించలేకపోయారు.
ఈ ఆలయంలోని శివలింగం ఎవరో ప్రతిష్టించింది కాదట. స్వయంగా ఉద్భవించిందని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు ఈ ప్లేస్‌ను వదిలి వెళ్లాలంటే కొంత ఇబ్బందిపడుతూనే వెళతారు. అంత బాగుంటుంది. ఇక్కడి విచిత్రమేంటంటే.. గర్భగుడి మొత్తం నిత్యం నీటితో నిండి ఉంటుంది. వేసవిలో కూడా ఇక్కడ నీరు ఎండిపోవడమనేది ఉండదు. అసలు నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా తెలియదు. ఒకే లెవల్‌లో ఏడాదంతా ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. ఇది సైంటిస్టులకు సైతం అంతుచిక్కని మిస్టరీ. ఈ నీటికి వ్యాధులను సైతం నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. ఇక ఈ ఆలయంలోని రహస్యాన్ని ఛేదించేందుకు సైంటిస్టులు చాల ప్రయత్నిస్తున్నారు కానీ కుదరడం లేదు.