జనమేజయునికి శాప విముక్తి కలిగింది ఇక్కడేనట..

గురువాయూర్‌లోని శ్రీకృష్ణ పరమాత్ముడి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. కన్నయ్య ఆలయాలన్నింటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయమిది. భూలోకంలో వెలిసిన దివ్యక్షేత్రంగానూ.. భూలోక వైకుంఠంగానూ దీనిని భక్తులు భావిస్తారు. ఈ గురువాయూర్ స్వామివారి క్షేత్రంలోనే జనమేజయునికి శాపవిముక్తి కలిగిందట. పరీక్షిత్‌ మహారాజు తక్షకుని కాటుకు గురికావడంతో ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేయడంతో లక్షలాది సర్పాలు చనిపోయాయట. సర్పదోషం కారణంగా జనమేజయునికి కుష్టు రోగం వచ్చిందట. అప్పుడు దత్తాత్రేయుని సూచన మేరకు గురువాయూర్‌ క్షేత్రానికి వచ్చిన జనమేజయుడు నిత్యం స్వామి దర్శనం చేసుకునేవాడట. అలా ఒక రోజు అతనికి కుష్టు రోగం మాయమైంది.

గురువాయూర్‌లోని శ్రీకృష్ణ పరమాత్ముడి ఆలయం విశేషమేంటంటే… కేరళలో దాదాపుగా చిన్నారుల అన్నప్రాసనలన్నీ ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు. కృష్ణుని సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే చిన్నారులకు ఎలాంటి ఆపదలు రావని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడి కన్నయ్య సన్నిధిలో వివాహాలు కూడా ఎక్కువగా నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తులాభారం ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చిన్నకృష్ణుని దర్శనం అనంతరం ఇక్కడ దర్శించుకోవాల్సిన మరో ఆలయం కూడా ఉంది. గురువాయూర్‌కు సమీపంలోని మమ్మియూర్‌లోని పరమశివుడి ఆలయాన్ని కూడా దర్శించుకుంటే క్షేత్ర సందర్శన పూర్తవుతుంది.

Share this post with your friends