
లక్షీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి ‘నేను వెళ్లి పోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను అడుగు’ అని అన్నదట.
అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో.. అమ్మా నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్నచోట ఒకరు వుండరు.
కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. లక్ష్మీదేవి తథాస్తు అని వెళ్లిపోయింది. కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు, కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.
కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు, కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంత సేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ఆవ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి అనకుండా తిని లేస్తాడు. కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయినదని గ్రహించి నాన్న గారు తిన్నారా? అని భార్యను అడుగుతాడు. తిన్నారని చెబుతుంది.
దాంతో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు. నేనెందుకు అనాలి? అని ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. ఇలా ఇంటి వాళ్లంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉండిపోయారు. ఆ రోజు సాయంత్రం ‘దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను వెళ్లిపోతున్నాను. ఉప్పు విషం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలూ రాలేదు. మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను’ అని వెళ్లిపోతుంది. దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంటిలో ప్రేమ, అప్యాయతలు, శాంతి వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుందని ఈ కథ సారాంశం.
