పంచ భూతలింగాలు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. పంచభూత లింగాలలో నాలుగు తమిళనాడులో.. ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇక ఈ పంచ భూత లింగాలలో మొదటిదైన ఆకాశ లింగం.. తమిళనాడులోని చిదంబరంలో ఉంది. ఈ చిదంబరంలో పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడ శివయ్య నిరాకారుడై దర్శనమిస్తాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే.. స్వామివారి గర్భగుడిలో మనకు శివలింగం కానీ.. ఎలాంటి విగ్రహం కానీ కనిపించదు.
భక్తులు దర్శనానికి వెళ్లిన సమయంలో అక్కడి పూజారులు తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపిస్తారు. అక్కడ భక్తులకు కేవలం గోడ మాత్రమే కనిపిస్తుంది. భక్తులు ఆ గోడనే శివ స్వరూపంగా భావించి దర్శించి పూజలు నిర్వహిస్తారు. స్వామివారు ఆకాశ లింగానికి ప్రతీక కాబట్టి అక్కడ భక్తులకు విగ్రహం కానీ శివలింగం కానీ ఉండదు. ఆకాశమంటే శూన్యం తప్ప ఏమి లేదని అర్థం. అందుకే నిరాకారుడిగా స్వామివారు ఉంటారు కాబట్టే ఏ ఆకారం మనకు కనిపించదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదే కావడం విశేషం.