అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి కొంత వరకూ తెలుసుకున్నాం కదా. ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం. ఈ ఆలయ రక్షణకు అతి పెద్ద కందకం నిర్మించడం జరిగింది. దాదాపు 700 అడుగుల వెడల్పుతో ఆలయం చుట్టూ దీనిని నిర్మించారు. ఈ కందకాన్ని దూరం నుంచి చూస్తే మనకు సరస్సులా కనిపిస్తుంది. అంగ్ కోర్ వాట్ దేవాలయంలో పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి ఒక వంతెన ఉంది. దాన్ని దాటితే దాదాపు వెయ్యి అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే పెద్ద ద్వారం ఉంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఇదే కావడం విశేషం. ఈ ఆలయం సనాతన ధర్మానికి నిదర్శనంగా చెబుతారు. దీని గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు, అప్సరసలు, దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం కథలు మనకు ఆలయ గోడలపై దర్శనమిస్తాయి. కంబోడియా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. కంబోడియా జాతీయ జెండాలో సైతం ఈ ఆలయానికి స్థానం కల్పించారు. అలాగే ఈ ఆలయం మేరు పర్వతానికి కూడా చిహ్నంగా ఉంది.