మాఘ స్నానం విశిష్టత ఏంటో తెలిపే కథ ఇది..

మాఘమాసం నదీ స్నానాలకు అత్యంత విశిష్టత ఉంది. దీనిని తెలిపే పద్మపురాణాంతర్గతమైన కథ ఒకటి ఉంది. పూర్వ కాలంలో వింధ్య పర్వత ప్రాంతంలో భృగు మహర్షి తపస్సు చేసుకుంటుండగా కరువు వచ్చిందట. దీంతో ఆయన కైలాస పర్వత శ్రేణుల్లోని మణికూట పర్వతానికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేయనారంభించారట. ఒకరోజు శార్దూల ముఖాకృతి కలిగిన ఒక వ్యక్తి, జగదేక సుందరి వంటి స్త్రీతో కలిసి భృగు మహర్షి వద్దకు వచ్చాడట. తాను సుమఖుడననే విద్యాధరుడినని.. ఆమె తన ధర్మపత్ని అని భృగువుకు పరిచయం చేసుకున్నాడు. తామిద్దరం పై లోకాలకు వెళ్లొస్తుండగా తనకు శార్దూల ముఖాకృతి వచ్చిందని.. అసలు అదెందుకు వచ్చిందో కూడా తెలియదన్నాడు. తన వికార రూపు పోయేందుకు మార్గం చెప్పమని కోరాడు.

భృగు మహర్షి దివ్య దృష్టితో ఏమి జరిగిందో తెలుసుకున్నారు. “విద్యాధరా! నీవు కృతయుగంలో ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు. ద్వాదశి రోజున స్నానం చేసి పారణ చేయవలసి ఉండగా తైలంతో అభ్యంగన స్నానం చేశావు. అందుకే నిన్ను ఈ దోషం వెంటాడుతోందని చెప్పాడు. జన్మ జన్మాంతరాలలో చేసిన ఏ చిన్న పాపమైనా దాని ఫలం అనుభవించక తప్పదని భృగువు తెలిపాడు. ఇది విన్న విద్యాధరుడు తనకు ఆ పాపం పోయే మార్గం తెలుపమని కోరడంతో.. మాఘ మాసంలో నదీ స్నానం చేస్తే నీకు ఈ వికృత రూపు పోతుందని భృగు మహర్షి అతనికి చెప్పాడు. భృగువు చెప్పినట్టుగానే విద్యాధరుడు మాఘమాసంలో నదీ స్నానం చేసి తన పూర్వ రూపాన్ని పొందాడు. కాబట్టి మాఘ మాసంలో నదీస్నానానికి అంతటి విశిష్టత ఉందని ఈ కథ చెబుతుంది.

Share this post with your friends