పూజైనా, శుభకార్యమైనా మనం ముందుగా పూజించేది వినాయకుడినే. ఇక ఇప్పుడు అయితే గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నాం. కానీ ఒక చోట మాత్రం వినాయకుడికి పూజలు లేవు. కనీసం ఒక పందిరి వేసిన పాపాన కూడా పోవడం లేదు. వినాయకుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. మళ్లీ ఆయనేమి సాదాసీదా వినాయకుడు కాదు.. దేశంలోనే అతి పెద్ద ఏక శిల ఐశ్వర్య గణనాథుడు. ఇంతకీ ఆ గణపతి ఎక్కడున్నాడు.. అంటారా? తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో కొలువుదీరాడు.
30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా విగ్రహం దేశంలోనే మరెక్కడా లేదు. ఇది 11వ శతాబ్దం కాలం నాటిదట. పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడట. అయితే తైలంపుడి తల్లి అనారోగ్యం పాలవడంతో నిర్మాణం చేయకుండా అలా వదిలేశారట. ఇప్పుడు అక్కడ ఆలయం నిర్మించాలని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విగ్రహం చుట్టూ సుమారు ఆరున్నర ఎకరాల భూమి ఉంది. దీనిని కొనుగోలు చేసిన ఉత్తరదేవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. మైసూర్‌కు చెందిన వేద పండితులు ఈ భారీ గణనాథుడికి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేసి పూజలు నిర్వహించారు. ప్రస్తుతం వినాయక చవితి నేపథ్యంలో పూజలు జరుగుతున్నాయి.