ఇవాళ దేశ వ్యాప్తంగా గణనాథులు కొలువయ్యారు. వీరిలో ముంబైలోని లాల్ బాగ్చా రాజా వినాయకుడు వెరీ స్పెషల్. పైగా దేశంలోనే అత్యంత సంపన్న వినాయకుడు. ఈ గణపతిని 66 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 325కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు. ఇవి చాలవన్నట్టుగా అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చిన రూ.20 కోట్ల విలువ చేసే 20 కేజీల బంగారు కిరీటాన్ని ఈ విఘ్నేశ్వరుడిగా బహుమతిగా సమర్పించారు. దొంగలు ఎత్తుకుపోతేనో అనే సందేహం రావొచ్చు. అందుకే ఈ వినాయకుడికి రూ.400.58 కోట్ల బీమా కవరేజీ సైతం తీసుకున్నారు.
ఇక ఖైరతాబాద్ వినాయకుడి గురించి చెప్పుకోవాల్సిందేముంది. దేశంలో వెరీ స్పెషల్ గాడ్. 70 అడుగుల ఎత్తైన ఇకో ఫ్రెండ్లీ గణపతి. ప్రతి ఒక్కరినీ కళ్లు తిప్పుకోనివ్వడు. ఇక చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో దొండకాయలు, పూలతో వినాయకుని ప్రతిమను తయారుచేశారు. ఇది కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. పచ్చని దొండకాయలతో రూపొందిన గణేషుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు.
ఇక విశాఖ నగరంలో భారీగా గణనాథులు కొలువుదీరారు. వారందరిలోకి ఆ మాటకొస్తే ఏపీలోనే ప్రముఖంగా నిలిచాడు 75 అడుగుల ఎత్తు బెల్లం వినాయకుడు. గాజువాక బస్ డిపో పక్కన ఈ వినాయకుడని ఏర్పాటు చేశాడు. ఈ వినాయకుడి రూపకల్పనలో 20 టన్నుల బెల్లాన్ని వినియోగించారు. బెల్లం దిమ్మెలను క్రమపద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారాన్ని తీర్చిదిద్దారు. ఈ వినాయకుడిని రూపొందించేందుకు శిల్పులు రెండు నెలలకు పైనే కష్టపడ్డారట. ఇక ఈ బెల్లాన్ని వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడేందుకు గానూ రాజస్థాన్ నుంచి తెప్పించారు. ఇది ఎంత వేడినైనా తట్టుకోవడంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందట.