
దేశంలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయాల్లో తొలి స్థానంలో ఉన్నది తిరుమల. దీనికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. తిరుమల కొండపై చిత్ర విచిత్రాలు చాలానే ఉన్నాయి. ప్రతిదీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అడుగడుగునా శ్రీ మలయప్ప స్వామివారు కలియుగ దైవంగా పేరొందాడు. ఇక ఇక్కడ కనిపించే ఆసక్తికర విషయాల్లో మనం చూడాల్సిన ఒక అద్భుతమైన దృశ్యం ఉంది. దానిని నేరుగా కాకుండా మనో నేత్రంతో చూడాల్సి ఉంటుంది.
ఇక ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే.. శ్రీవారి సహజ శిల ఇది. దూరం నుంచి చూస్తే శ్రీ వేంకటేశ్వర స్వామివారి రూపం ఈ సహజ శిలలో స్పష్టంగా కనిపిస్తుంది. భారీ విగ్రహం, శ్రీవారి మోహము, తలపై కిరీటంతో ఓ చెక్కిన శిల్పంలా సాక్షాత్కరిస్తుంది. మరి ఇది ఎక్కడ ఉంది అంటారా? తిరుపతి నుంచి తిరుమలకు మనం ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తాం కదా. ఆ ఘాట్ రోడ్డులో చివరి మలపు నుంచి గమనిస్తే దూరంగా శ్రీవారి సహజ శిల కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేక పర్వదినాలలో స్థానికులు ఈ సహజ శిలకు పూజలు చేస్తారు.
