ఆరుపడైవీడు ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. తమిళనాడు మధురై జిల్లాలో ఈ తిరుప్పరన్‌కుండ్రం ఉంది. ఇక్కడి ఆలయం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది. ఈ ఆలయ విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడి ప్రధాన మందిరంలో సుబ్రహ్మణ్యస్వామి, దీనికి సమీపంలో ఆది దంపతులైన శివపార్వతులు, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండప, మహామండపాలు.. వాటిపై ఉన్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ప్రముఖ తమిళకవి నక్కిరార్‌కు ఒక ఆలయముంది.
ఈ నక్కిరార్ ఆలయం గురించి ఒక కథ ఉంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్‌కు ఒక రోజు ఆలయ పుష్కరిణలో సగం చేప, సగం పక్షి రూపంలో ఉన్న ఒక జీవం కనిపించిందట. దాన్ని చూడగానే విస్తుబోయిన నక్కిరార్.. దాన్ని అలాగే చూస్తుండటంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపం కాస్తా కొద్దిసేపటికే రాక్షసరూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది. అప్పుడు తనను రక్షించాలంటూ మురుగన్‌ని వేడుకుంటూ తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కిరార్‌ను అతనితో పాటు ఉన్న వారందరినీ రక్షించాడు. ఆ తరువాత స్వామి తన వేలాయధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగ జలం బయటకు వచ్చింది. అది ఇప్పటికీ ఉంది. ఈ జలంలో మునిగితే చాలు.. పాపాలన్నీ పోతాయని నమ్మకం. ఎంత వేసవి కాలమైనా ఈ తీర్థం ఎండిపోకపోవడం విశేషం.