తెలుగులో ఎన్నో విశేషణాలు.. ఎన్ని రామాయణంతో ముడిపడ్డాయో తెలిస్తే..

తెలుగులో ఎన్నో సామెతలు, విశేషణాలు ఉన్నాయి. దాదాపుగా ప్రతిదీ రామాయణంతో ముడిపడి ఉంటుంది. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది. చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం. జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం. కబళించే చేతులు, చేష్టలు కబంధ హస్తాలు. వికారంగా ఉంటే – శూర్పణఖ. చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -అంగదుడి అంగలు. మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు. ఎంగిలిచేసి పెడితే – శబరి. ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు. అల్లరి మూకలకు నిలయం కిష్కింధ కాండ. విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -అగ్ని పరీక్షలే. పితూరీలు చెప్పేవారందరూ -మంథరలే. సాయం చేసినపుడు- ఉడుతా భక్తి.. కార్యాన్ని సాధించినపుడు – హనుమ యుక్తి.. గొడవ కు దిగే వాళ్ళ పేరు – లంకిణి. యుద్ధమంటే రామరావణ యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -(రావణ కాష్టాలే). కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

Share this post with your friends