లోకంలో కోట్లాది మంది దంపతులున్నా.. వారంతా ఎలా ఉంటారంటే..

ఈ లోకంలో.. కోట్లాది కోట్ల దంపతులుంటారు. కానీ వాళ్లంతా 5 విధాలుగానే ఉంటారు.

మొదటిది లక్ష్మీనారాయణులు

విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై.. ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో.. ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.

గౌరీశంకరులు అర్థనారీశ్వర రూపం…

తలనుంచి కాలిబొటన వేలి వరకూ నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు. రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలా ఉన్నవారు గౌరీశంకరుల జంట.

మూడవది బ్రహ్మసరస్వతుల జంట

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుకనేది మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.. ఇలా ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య .. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

నాలుగవది ఛాయా సూర్యులు..

సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతుంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు. విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా, పట్టుదలతో ఉంటాడో. ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

అయిదవది రోహిణీ చంద్రులు

రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు.. మెత్తనివాడు. ఏ జంట భర్త మెత్తగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో.. భార్య మాత్రం కఠినాతి కఠినంగానూ కోపంతోనూ.. పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

Share this post with your friends