వినాయక నిమజ్జనంలో బాగా వినిపించే స్లోగన్.. ‘గణపతి బప్పా మోరియా’. అసలు మోరియా అంటే ఏంటి? ఈ పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అది 15వ శతాబ్దం నాటి కథ. అప్పట్లో మోరియా గోసావి అనే సాధువు వినాయకుడికి వీర భక్తుడు. అతను మహారాష్ట్రలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. మోరియా గోసావి గణపతిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఒకరోజు మోరియాకు కలలో గణపతి కనిపించి తన విగ్రహం సమీపంలోని నదిలో ఉందని.. దానిని తీసుకొచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.
వెంటనే మోరియా ఆ నది వద్దకు వెళ్లగా అక్కడ గణపతి చెప్పినట్టుగానే వినాయకుడి విగ్రహం దొరికింది. వినాయకుడిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చారు. మోరియా చాలా గొప్పవాడని అందుకే వినాయకుడు కలలో కనిపించాడని గణపతితపో పాటు ఆయన పాదాలను సైతం భక్తులు తాకి మోరియా అని అరవడం మొదలు పెట్టారు. అనంతరం గణపతికి గుడిని నిర్మించారు. అప్పటి నుంచి గణపతి ఉత్సవాల నినాదాల్లో మోరియా కూడా భాగమైపోయింది. ఇప్పటికీ నిమజ్జనం సమయంలో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ మరాఠీలో సైతం నినదిస్తాం.