తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది రకాల 20 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు.
మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 1, పుష్కరిణి వద్ద 1, వాహన మండపం వద్ద 1, ఫ్రైడే గార్డెన్స్ 1, తొలప్ప గార్డెన్ 1 కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
స్వర్ణరథోత్పవం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, ఎస్ ఇ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.