తమిళ పదమైన తిరునామం అంటే అర్థమేంటంటే..

శ్రీనివాసుడి భక్తులకు తిరునామధారణ చేసేందుకు ముఖ్యంగా రెండు పదార్థాలను వినియోగిస్తారు. అవి నామకోపు, ఎర్రసింధూరం. ఇవి రెండు పెట్టుకుంటే చలువ చేస్తుందట. వైఖాసన సంప్రదాయం ప్రకారం అసలు తిరునామం అంటే ఏంటంటే.. నాశిక పై భాగం నుంచి నుదుటి పై భాగం వరకూ అలంకరించబడి ఉండే నామం. తమిళ పదమైన ఈ తిరునామం అర్థం ఏంటంటే.. తిరు అంటే శ్రీ.. నామం అంటే తిలకం.. అందుకే తిరునామాన్ని శ్రీనామం అని కూడా పిలుస్తారు. మొత్తంగా చూస్తే తిరునామం అంటే పవిత్రమైన నామమని అర్థం.

తిరునామం అనేది ముఖ్యంగా మూడు రకాలుా ఉంటుంది. శ్రీవారి నుదుటన దిద్దే నామం, వైష్ణవుల్లోని వడగలై అనే తెగ దిద్దుకునే నామం, తెంగలై అనే మరో తెగ దిద్దుకునే నామం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తిరునామ ధారణ చేసుకుంటారు. వడగలై తెగ వారు ఆంగ్ల అక్షరమైన యు ఆకారంలో ఊర్ధ్వపుండ్రాలు నామం దిద్దుకుంటే.. తెంగలై వారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామ ధారణ గావిస్తారు. శ్రీవారి నుదుటన దిద్దే తిరునామం తమిళ అక్షరం ‘ప’ను పోలి ఉంటుంది. అందుకే శ్రీ వేంకటేశ్వరస్వామివారి తిరునామాన్ని తిరుమణికావు అని పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరునామాన్ని స్పష్టంగా చూడాలంటే గురువారం చూడొచ్చు. ఆ రోజున స్వామివారికి అలంకరణ ఉండదు. శుక్రవారం అభిషేకం తర్వాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పరం, కస్తూరితో తిరునామం దిద్దుతారు. శ్రీవారికి దిద్దే తిరునామం కోసం 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.

Share this post with your friends