వరలక్ష్మీ వ్రత కథ మీకోసం..

వరలక్ష్మీ పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు వ్రత కథ గురించి తెలుసుకుందాం. వరలక్ష్మీ వత్ర కథను.. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడట. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంలో పరమేశ్వరుడు కూర్చుని ఉండగా.. పరమేశ్వరునకు పార్వతీదేవి నమస్కరించి ‘దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖముగా ఉందురో అట్టి వ్రతమను నా కానతీయవలయు’ అని అడగ్గా పరమేశ్వరుడు..వ్రత విధానమును వివరించాడు.

మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము ఉంది. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడ, బంగారు గోడలు గల ఇళ్లతోనూ ఉండేది. ఆపట్టణము నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ ప్రతి దినంబును ఉదయమున మేల్కొని స్నానమాచరించి.. పుష్పములతో భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారంబులను చేసి ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇలా ఉండగా.. ఆ మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి ఒకనాడు స్వప్నంలో ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!

శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు అయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి.

చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.

వాయన దానము:

శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!

శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!

Share this post with your friends