సకల విఘ్నాలను తొలగించే వినాయకుడికి తొలి పూజ చేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం తలపెట్టినా వినాయకుడిని పూజించుకున్న మీదటే పని మొదలుపెడతాం. అంటి ప్రాధాన్యతనిచ్చే వినాయకుడికి ఊరారా ఆలయాలున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గణేశుని ఆలయాలన్నింటిలోనూ ప్రత్యేకం. ఈ ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? ఈ క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికర విషయం ఏంటంటే.. బిక్కవోలు గణపతి ఆలయం.
చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే చాలట. కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయనే నమ్మకం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. స్వామివారి తొండం కుడి వైపునకు తిరిగి ఉంటుంది. గణపతి విగ్రహ తొండం ఇలా కుడి వైపునకు తిరిగి ఉంటే కోరిక కోరికలు తప్పక నెరవేరుస్తాడట. బిక్కవోలు గణపతి సుమారు ఏడు అడుగుల ఎత్తు ఉంటాడు. అలాగే పెద్ద పెద్ద చెవులతో ఆకర్షణీయంగా కూర్చొని ఉంటాడు. అది మాత్రమే కాదు. ఇక్కడి విఘ్నేశ్వరుడు కొద్దిగా వెనక్కు వంగి మహారాజ ఠీవి ఉట్టిపడేలా దర్శనమిస్తాడు.